పొట్లూరి హరికృష్ణ సంపాదకత్వంలో "తెలుగు వాణి" విడుదల

updated: February 23, 2018 13:38 IST
పొట్లూరి హరికృష్ణ  సంపాదకత్వంలో

తెలుగు భాషా గొప్పతనం వివరించేలా కవితా సంకలనం వెలువరిస్తామని ప్రకటిస్తూ గతంలో  తెలుగు రక్షణ వేదిక కవితలను ఆహ్వానించింది. ప్రకటనకు స్పందించి వచ్చిన కవితలలో మంచి వాటిని ఎంచి "తెలుగు వాణి" పేరుతో కవితా సంకలనం ప్రచురించారు. ఈ కవితా సంకలనానికి ప్రధాన సంపాదుకులుగా తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్ష్యుడు కళారత్న పొట్లూరి హరికృష్ణ,సహాయ సంపాదుకుడుగా నారంశెట్టి ఉమామహేశ్వరరావు ,తెలుగు రక్షణ వేదిక కార్యదర్శి వ్యవహరించారు. తెలుగు వాణి కవితా సంకలనం ఆవిష్కరణ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్బంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ఘనంగా జరిగింది.  

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖా మాత్యులు దేవినేని ఉమా మహేశ్వరరావు, విజయవాడ నగర మేయర్ గద్దె అనూరాధ,  భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు డా.దీర్ఘాశి విజయభాస్కర్, తెరవే జాతీయ అధ్యక్ష్యుడు కళారత్న పొట్లూరి హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమీ అధ్యక్ష్యులు గుమ్మడి గోపాలకృష్ణ, కూచిపూడి కళారామం అధ్యక్ష్యుడు కూచిభట్ల ఆనంద్, ప్రముఖ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు,  ప్రముఖ రచయిత జీ.వి. పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  మాట్లాడుతూ... మనందరి గుండె చప్పుడు తెలుగుకావాలి. మన భాష కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని అందుకోవాలి. తరతరాల వారసత్వ సంపదగా మనకు అందుతున్న తెలుగు భాష, సంస్కృతులను భావితరాలకు కానుకగా ఇవ్వాలని అన్నారు.  అలాగే  మాతృ భాషకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన మహనీయుల్ని సత్కరించుకోవటం తెలుగువారందరి ప్రాథమిక బాధ్యత అన్నారు. మాతృభాష ద్వారానే జ్ఞానం వికసిస్తుందన్నారు. రోజంతా పనిచేసిన కష్టం నుంచి భాషా, సాంస్కృతిక ప్రదర్శనలు ఉపశమనం కలిగిస్తాయన్నారు.

 

జడ్పీ అధ్యక్షురాలు అనూరాధ మాట్లాడుతూ జిల్లా పాలనలో దాదాపుగా తెలుగుభాష అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ తన జీవితచరిత్రను ఆయన మాతృభాష అయిన గుజరాతీలో రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రాథమిక విద్యలో మాతృభాష మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలన్నారు.

comments