తెలుగు వీర లేవరా..శ్రీశ్రీ వేలు పట్టుకుని సాగరా

updated: April 30, 2018 21:50 IST
తెలుగు వీర లేవరా..శ్రీశ్రీ వేలు పట్టుకుని సాగరా

నేడు శ్రీ శ్రీ 108 వ జయంతి 

సాహిత్యం అంటే అక్షరాలో, ఉపమానాలో కాదు. ఆయా కాలాలలో నినదించిన,ధాకలుచేసిన సత్యాలు. నిన్నటి గురించి తెలియకపోతే ఈరోజు ఎలా అర్థం అవుతుంది? ఈరోజు అర్థం కాకపోతే, రేపటి  భవిష్యత్తు ఏం కనిపిస్తోంది. అలా కాలం అనే కత్తుల వంతెనపై ప్రయాణం చేయాలంటే శ్రీశ్రీలాంటి వారి సాహిత్యమే.. తరతరాల వంతెన గా నిలబడుతుందనటంలో అర్ద అక్షరం కూడా అసత్యం లేదు. 

అవును తెలుగు సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ ప్రభంజనం గురించి చాలా చర్చ జరిగింది..ఇంకా జరుగుతుంది. మహాప్రస్థానం ఇత్యాదిగా అన్ని రచనలపై ఇతోధికంగా ఇప్పటికే అనేక విశ్లేషణలు  వచ్చాయి. ఇటు అభిమానులే కాక అటు ఆయనంటే గిట్టని ఛాందసులు కూడా శ్రీశ్రీని ప్రస్తావించకుండా ఆధునిక తెలుగు సాహిత్య చర్చను చేయలేరు..అసలు పరిచయమే చేయలేరు. ఇదంతా శ్రీశ్రీ  సృజన సాధించిన ఘనత. ఆయన సృష్టించిన  సాహిత్యం సాధించిన ఘన విజయం.

ఒక్క సాహిత్యంపై మాత్రమే కాక సైన్సు, ఫిలాసఫీ, రాజకీయాలు, చరిత్ర, ఎకానమీ, సినిమా... ఇలా అనేక అంశాలపై శ్రీశ్రీ అభిప్రాయాలు ఇప్పటికే ఎక్కడో చోట కోట్ చేయకుండా ఉండలేం. అవి  అంతలా ఈ తరాన్ని కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. 

ఆయన ఓ చోట ఇలా అంటారు.. ‘సాహిత్యమనేది ప్రజలకు ఉయోగకరమైనప్పుడే సార్థకమౌతుంది. కళ కోసం కళ అనే వాదానికి నేను బద్ధ విరోధిని. ప్రగతి శక్తులను ఎగసన దోసేది అయిన రచన నిజమైన సాహిత్యమని నేననుకుంటాను. కవిత్వంలో గానీ, నవలలో గానీ, ఏకాంక నాటికల్లో గానీ అన్ని సాహిత్య రూపాల్లోనూ ప్రగతికి దోహదకంరగా వుండేది, ప్రతీప శక్తులను వ్యతిరేకిస్తూ వాటి మీద పోరాటం జరిపించేటి ఏ సాహిత్యమైతే వుంటుందో అటువంటిది నాకు సమాదరణీయమని అనిపిస్తుంది’. 

శ్రీశ్రీ కలం చాలా వాడిగా సమాజంలోని మూఢవిశ్వాసాలను చీల్చి చెండాడింది. సాహిత్యం ద్వారా సమాజప్రగతికి దోహదం చేయాలని విశ్వసించిన శ్రీశ్రీ సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను తూర్పారబట్టారు. ఇరవైయ్యో శతాబ్ధపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన ఈ మహాకవి తెలుగునాట అభ్యుదయ కవిత్వానికి ఊపిరిలుదారు. సామాన్యులకి అర్థమయ్యే రీతిన తెలుగు సాహిత్యాన్ని సరిళించి ఎన్నో కవితా సంపుటులు, పుస్తకాలు రాశారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకునేది శ్రీశ్రీ మహా ప్రస్థానం. 

అలానే తెలుగు చిత్రసీమకు రచయితగా ఎనలేని సేవలందించారు శ్రీశ్రీ. తెలుగు తొలి డబ్బింగ్ సినిమా 1950లో విడుదలైన ‘ఆహుతి’కి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీనే . ఇక సినీగేయ రచయితగా శ్రీశ్రీ సృష్టించిన రికార్డలు ఇప్పటికి ఎవరూ బ్రద్దలు కొట్టలేదు. ‘కన్యాదానం’  సినిమా కోసం ఒక్కరోజులో 12 పాటలు రాసిచ్చారు శ్రీశ్రీ. అలాగే ఎఎన్నార్ నటించిన డాక్టర్ చక్రవర్తి కోసం శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై’ అనే మధుర గీతాన్ని ఇప్పటికి శ్రోతలు ఆరాధిస్తున్నారంటే ఆ పాటలో శ్రీశ్రీ పదాల అల్లిక గొప్పతనమే. ఇక సూపర్ స్టార్ కృష్ట నటించిన అల్లూరి సీతారామరాజులో ‘తెలుగువీర లేవరా’ అంటూ జాతిని ఉద్దేశించిన శ్రీశ్రీ రాసిన పాటని తెలుగు వారు మర్చిపోవటం సాధ్యమా

చిత్రకారుడు : ప్రముఖ సినిమా  దర్శకుడు మరియు నటుడు శ్రీ దేవి శ్రీ ప్రసాద్


Tags: srisri, maha prasthanam

comments