కన్నుల కలలకు కాపలా

Updated: December 3, 2019 12:16:11 PM (IST)

Estimated Reading Time: 1 minute, 24 seconds

కన్నుల కలలకు కాపలా

ఎయిడ్సొచ్చిన పులిరాజు.... అయినా ఆకలేసినప్పుడే...
లేడిపిల్లకు ప్రమాదం
ఏడాదికోసారి వచ్చే చిత్తకార్తెలో మాత్రమే
కుక్కకైనా కిర్రెక్కేది
మగవాడు మగోడై మృగాడై స్థంభించడానికి
ఏ ఋతువు...ఏ సీజనూ...ఏ సమయమూ...ఏ స్థలమూ...
ఏ వావి వరుస...వయసొచ్చినా రాకున్నా
ఏ అడ్డూఆపూ ఏ అదుపూఆనకట్టా లేనేలేవు
అందుకే వాళ్లు అక్షరాలా మృగాళ్లు...
మృగాలే అసహ్యించుకునే మానవమృగాళ్లు...
మగజాతి ఎప్పుడో వెలేసిన మృగోన్మాదులు...
చనిపోయినా ... వదలని పురుషాంగాల మగపుటేనుగులు....

ఆరణాల ఆడపిల్లకు ఏ ఆరడులు లేని క్షణాలెప్పుడో ...
సొగసుకన్నుల కన్నెపిల్లల కలలను ఏ నిఘాకెమేరా కన్నులు కాపాడతాయో...
ఎన్ని "వంద"(Dail 100)లు ఈ మందలను పందులదొడ్లో కట్టి ఉంచుతాయో...

తరాలు యుగాలు కేలెండర్లుగా దొర్లుకుపోతున్నా ... 
అమ్మాయిలు అంతరిక్షాలు దాటిన అభివృద్ధి శిఖరాల సింహాసనాలపై ఆశీనులౌతున్నా...
బుడగల్లా గెడకు వేలాడే బతుకుతెరువమ్మీలు ఆర్తనాదాలవుతున్నా... 
పాలకోసం గుక్కపెట్టాల్సిన పసికూనలకు తెలియని చావుకేకలేస్తున్నా ...
ఇంకా ఎన్నాళిలాగే ప్రశ్నలు ప్రశ్నోపప్రశ్నలు మర్రి ఊడల్లా ....  
ఇంకెంతకాలమిలాగే .... ఇలాగే ... ఇలాగే ... 
అదుగో ...అప్పుడే ... ఇంకో తాజావార్త ... 
నెత్తురోడుతున్నమానాలతో అక్షరాలు ... 
టీవీ తెరలపై కెరలెత్తుతున్నాయి

కామెంట్స్